ఓటు వెయ్యడానికి ఇంటికి వెళ్లాను. ఓటు వేసాను కూడా. టిక్కెట్టు ఆ వారాంతానికి తీసుకున్నాను . ఆ వారం అంతా ఇంటి నుంచే పని, అమ్మ నాన్నతో సమయం గడపడం. గడిచిపోతుంది బాగానే. ఒక రోజు రాత్రి నాన్నగారు కొట్టు నుంచి వచ్చేసారు, ఇంటికి తాళం కూడా వేసేసారు. ట్రింగ్ అని బెల్లు మోగింది . ఈ సమయం లో ఎవరా అని నాన్నగారితో పాటు నేను కూడా వెళ్ళాను తలుపు తియ్యడానికి. చంద్రం అంకుల్ , "ఏమిటి జగన్నాధం, అప్పుడే వచ్చేసావా అనకాపల్లి నుంచి". "హా ఇప్పుడే వచ్చాను" అన్నారు నాన్నగారు. ఇంతలో హాల్లోకి అమ్మ వచ్చి "సుద గారి కిట్టి డబ్బులు అందరూ ఇచ్చేసారు " అని ఒక పర్సు అందజేసింది అంకుల్ కి. అంకుల్ డబ్బులు లెక్కపెట్టుకుని లోపల పెట్టుకున్నారు. "థాంక్స్ అమ్మ" అన్నారు . "అయ్యో .. అదేముంది లెండి. సుద గారి ఆరోగ్యం జాగ్రత్త " అన్నాది అమ్మ. నెమ్మదిగా లేచి ఇంటి బయటకు నడవసాగారు, నన్ను "ఎక్కడుంటున్నావ్.. ఎం చేస్తున్నావ్.. " వంటి ప్రశ్నలు వేస్తూ. మెట్లు దిగుతూ వెనక్కి తిరిగి నాన్నగారి వైపు చూస్తూ తన ముద్ద గొంతుతో ఇలా చెప్పసాగారు "జగన్నాధం.. గుర్తుందా చిన్నపుడు మీ ఇంట్లో తెగ ఆడుకునేవాడిని . మాలతి , రమేష్ , నూకరాజు వీళ్ళందరూ నా బ్యాచ్ . ఇంట్లో బోల్డు మంది ఉండేవారు. ఆ సందడే వేరు . జాయింట్ ఫామిలీస్ కదా . ఈ ఇంటి పునాదులు ఉండేవి (మా ఇంటిని చూపిస్తూ), వాటి మీటి ఇసకలో దొర్లుతూ తెగ ఆడుకునేవాళ్ళం ఎవరో ఒకరు వచ్చి తిట్టేదాకా. ఏమిటో .. ఇప్పుడు అలా లేదు. ఇంట్లో ఇద్దరం అయిపోయాం. మా ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం కాదు కానీ చాలా కష్టం గా ఉంది. నేను ఏదో తనకి సహాయం చేద్దాం అంటే మనకు ఆ పనులు చేతకావాయే. ఏదో ఒక సాయం చేయబోయి ఇంకో పని తెచ్చిపెడుతున్నా. మా చిన్నోడు వచ్చి ఉన్నాడు ఒక నాలుగు నెలలు వాళ్ళ మేనేజర్ ని అడిగి. మొన్నే ఊరు వెళ్ళాడు. వాడు మాత్రం ఎన్ని రోజులని ఉండగలడు చెప్పు. మా పెద్దోడు, కోడలు లండన్ లో వున్నారు . బిజినెస్ కూడా పెద్దగా చెయ్యలేకపోతున్నా . ఇప్పుడు నాకు 65 ఏళ్ళు ఇంకో రెండేళ్లలో కొట్టు మూసేద్దామని మెంటల్ గా ఫిక్స్ అయ్యాను . పోనీ పిల్లల్ని మిమ్మల్ని ఆపలేము మేము (నా వైపు చూస్తూ ). మీ భవిష్యత్తు ని పాడుచెయ్యలేము కదా. మీ జనరేషన్ ఎవరూ ఇప్పుడు ఊర్లో వ్యాపారాల్లో లేరు కదా . ఇంకో పదేళ్ళల్లో మన వాళ్ళ కొట్లు అన్ని మూసుకుపోతాయి". "అందరి పరిస్థితి అలాగే ఉంది " అని అన్నారు నాన్నగారు మెల్లగా. బహుశా నేను ఉన్నాననేమో, ఎక్కువగా మాట్లాడలేదు నాన్నగారు . చంద్రం అంకుల్ బయటకు ధైర్యం గానే ఉన్నా లో లోపల ఎంతో భావోద్వేగానికి లోనయ్యారని నాకు అనిపించింది . నెమ్మదిగా బండి ఎక్కి ఇంటికి బయలుదేరారు అంకుల్.."
- అహం బ్రహ్మాస్మి
- అహం బ్రహ్మాస్మి
No comments:
Post a Comment