Thursday, April 9, 2020

నాన్నకి ముద్దులతో ..

"గురు.. శుక్ర .. శని .. శనివారం 29 వ రోజు అవుతుందండి .. ఆ రోజు  చూసేయచ్చు .. " అని అన్నాది అమ్మమ్మ తాతయ్యగారితో. నా ఆనందానికి హద్దులు  లేవు అసలు. అవును మా నాన్నని మొదటి సారి చూడడం మరి. అప్పటికే 27 రోజులు అయ్యింది నేను పుట్టి .. నక్షత్రాలు బాలేవు .. గ్రహాలు బాలేవు అని మా నాన్నని నన్ను చూడనివ్వలేదు . చిన్న పిల్లని కదా, అందుకే గట్టిగా అడగలేకపోయాను . బయలుదేరే ముందు రోజు అసలు నిద్దరే పట్టలేదు సుమా . ఆ ఉత్సాహం లో డాన్స్ కూడా  చేశాను . మా అమ్మకి కూడా తెలిసి  ఉండదు లెండి ఆ విషయం. పొద్దున్నే లేచాకా స్నానం చేయించి కొత్త బట్టలు వేసారు నాకు. అందరూ తయారయ్యి నాకు పాలు పట్టేసాక బయలుదేరాము కార్ లో . తాతయ్యగారు నన్ను చూసి అన్నారు 'నాన్నని చూచేచున్నావా' అని నవ్వుతూ . నేను మనసులో నవ్వుకుని బయటకి నిద్రపోతున్నట్టు నటించాను .  దారి అంతా ఒకటే ఆలోచన . నాన్న నాలాగే ఉంటారా  అని . గంటన్నర తర్వాత 'వచ్చేసాం' అన్నారు తాతయ్యగారు . కళ్ళు తెరిచిచూస్తే గుడి . అంతా సిద్దమే . పూజ ఒకటే ఆలస్యం . అమ్మ, నాన్న ఇద్దరూ పూజ మొదలు పెట్టారు . ఇంతలో నానమ్మ నన్ను ఆడించింది. ఇంతలో పంతులుగారు 'పాపని తెర వెనుక  నుంచి నూని వైపు ఎత్తుకోండమ్మా ' అని అన్నారు . నానమ్మ అలాగే నన్ను గట్టిగా పట్టుకుంది . పంతులు గారు నాన్నని నన్ను  నూని నీడలో చూడమన్నారు . అప్పుడు నేను నాన్నని ఆ నూని నీడలో చూసేసా !!! ఎన్నాళ్ళకీ .. అనుకున్నా . అప్పుడు నన్ను నాన్న ఒడిలో వేసారు . నాన్న నా వైపు చాలా సంతోషంతో చూసి ఎంతో  మురిసిపోయారు ..

నాన్నకి ముద్దులతో .. 

Sunday, March 29, 2020

బేబీ ఆఫ్ లతా ...


"బేబీ ఆఫ్ లతా ... " అని పిలిచింది నర్స్ . వెంటనే ఒకావిడ లేచి కళ్ళు తుడుకుంటూ ఐసీయూ  లోపలికి వెళ్ళింది. నేను అప్పుడే పాప పాల బాటిల్ ఇవ్వడానికి మెట్లు దిగి వస్తున్నా  ఐసీయూ కి.

రెండవ రోజు కూడా ఆవిడ ఐసీయూ బయటే కుర్చీలో  కూర్చుంది వాళ్ళ అమ్మగారి భుజం పై తల వాల్చి . డాక్టర్ రాగానే ఏడుస్తూ పాప ఎలా ఉంది సార్ అని అడిగింది. పాప బాగానే ఉంది, కంగారు పడద్దు అని డాక్టర్ ధైర్యం చెప్పారు .  

నాకు ఆవిడ కష్టం  చూస్తే చాలా బాధ అనిపించింది. కంగారు పడద్దు అని చెప్దాము అనుకున్నా కానీ నా మొహమాటం అడ్డు వచ్చింది . తరువాత నా భార్య ద్వారా తెలిసింది . పాప ఎనిమిదవ నెలలోనే పుట్టింది . రెండు వారాలు ఐసీయూ లో ఉంచి  పంపించారు. మళ్ళీ పాపకి జలుబు, జ్వరం రాగానే కంగారు పడి మళ్ళీ వచ్చారు. పాపతో పాటు బాబు కూడా పుట్టాడు కానీ ప్రాణం ఎక్కువ సేపు నిలువలేదు . 

అలా నా భార్య తో ఆవిడ తన మనోగతాన్ని చెప్తూ ఒక్క మాట అందట " ఈ పసి పిల్లలండి యోధులంటే .. మనం కాదు ..  " అని . 


నిజమే అనిపించింది ... 


- అహం బ్రహ్మాస్మి 

Tuesday, October 15, 2019

మహా  సముద్ర ఘూష , మగవాడి మనసు భాష
లోపలుంచుకొని చేదు , లోకపు అంచుల్లో నివసించె
ఏమో తెలియదు రేపన్ననాడు
భారం భయం గా మిగిలేనా .. జీవితం అలాగే ముగిసేనా ..

-అహం బ్రహ్మాస్మి 

Saturday, April 13, 2019

ఓటు వెయ్యడానికి ఇంటికి వెళ్లాను. ఓటు వేసాను కూడా. టిక్కెట్టు ఆ వారాంతానికి తీసుకున్నాను . ఆ వారం అంతా ఇంటి నుంచే పని, అమ్మ  నాన్నతో   సమయం గడపడం. గడిచిపోతుంది బాగానే. ఒక రోజు రాత్రి నాన్నగారు కొట్టు నుంచి వచ్చేసారు, ఇంటికి తాళం కూడా వేసేసారు. ట్రింగ్  అని బెల్లు మోగింది . ఈ సమయం లో ఎవరా అని నాన్నగారితో పాటు  నేను కూడా వెళ్ళాను తలుపు తియ్యడానికి. చంద్రం అంకుల్ , "ఏమిటి జగన్నాధం, అప్పుడే వచ్చేసావా అనకాపల్లి నుంచి". "హా  ఇప్పుడే వచ్చాను" అన్నారు నాన్నగారు. ఇంతలో హాల్లోకి అమ్మ వచ్చి "సుద గారి కిట్టి డబ్బులు అందరూ ఇచ్చేసారు " అని ఒక పర్సు అందజేసింది అంకుల్ కి. అంకుల్ డబ్బులు లెక్కపెట్టుకుని లోపల పెట్టుకున్నారు. "థాంక్స్ అమ్మ" అన్నారు . "అయ్యో .. అదేముంది లెండి. సుద గారి  ఆరోగ్యం జాగ్రత్త " అన్నాది  అమ్మ. నెమ్మదిగా లేచి ఇంటి బయటకు నడవసాగారు, నన్ను "ఎక్కడుంటున్నావ్.. ఎం చేస్తున్నావ్..  " వంటి ప్రశ్నలు వేస్తూ. మెట్లు దిగుతూ వెనక్కి తిరిగి నాన్నగారి వైపు చూస్తూ తన ముద్ద గొంతుతో ఇలా చెప్పసాగారు "జగన్నాధం.. గుర్తుందా చిన్నపుడు మీ ఇంట్లో తెగ ఆడుకునేవాడిని . మాలతి , రమేష్ , నూకరాజు వీళ్ళందరూ నా బ్యాచ్ . ఇంట్లో బోల్డు మంది ఉండేవారు. ఆ సందడే వేరు . జాయింట్ ఫామిలీస్ కదా . ఈ ఇంటి పునాదులు ఉండేవి (మా ఇంటిని చూపిస్తూ), వాటి మీటి ఇసకలో దొర్లుతూ తెగ ఆడుకునేవాళ్ళం ఎవరో ఒకరు వచ్చి తిట్టేదాకా. ఏమిటో .. ఇప్పుడు అలా  లేదు. ఇంట్లో ఇద్దరం అయిపోయాం. మా ఆవిడకి  బ్రెస్ట్ క్యాన్సర్ రావడం కాదు కానీ చాలా కష్టం గా  ఉంది. నేను ఏదో తనకి  సహాయం చేద్దాం అంటే మనకు ఆ పనులు చేతకావాయే. ఏదో ఒక సాయం చేయబోయి ఇంకో పని తెచ్చిపెడుతున్నా. మా చిన్నోడు వచ్చి ఉన్నాడు ఒక నాలుగు నెలలు వాళ్ళ మేనేజర్ ని అడిగి. మొన్నే ఊరు వెళ్ళాడు. వాడు మాత్రం ఎన్ని రోజులని ఉండగలడు చెప్పు. మా పెద్దోడు, కోడలు  లండన్ లో వున్నారు . బిజినెస్ కూడా పెద్దగా చెయ్యలేకపోతున్నా .  ఇప్పుడు నాకు 65 ఏళ్ళు ఇంకో రెండేళ్లలో కొట్టు మూసేద్దామని మెంటల్ గా ఫిక్స్ అయ్యాను . పోనీ పిల్లల్ని మిమ్మల్ని ఆపలేము మేము (నా వైపు చూస్తూ ). మీ భవిష్యత్తు ని పాడుచెయ్యలేము కదా. మీ జనరేషన్ ఎవరూ  ఇప్పుడు ఊర్లో వ్యాపారాల్లో లేరు కదా . ఇంకో పదేళ్ళల్లో మన వాళ్ళ కొట్లు అన్ని మూసుకుపోతాయి".  "అందరి పరిస్థితి  అలాగే ఉంది " అని అన్నారు నాన్నగారు మెల్లగా. బహుశా నేను ఉన్నాననేమో, ఎక్కువగా మాట్లాడలేదు నాన్నగారు . చంద్రం అంకుల్ బయటకు ధైర్యం గానే ఉన్నా లో లోపల ఎంతో భావోద్వేగానికి లోనయ్యారని  నాకు అనిపించింది . నెమ్మదిగా బండి ఎక్కి ఇంటికి బయలుదేరారు అంకుల్.."


- అహం బ్రహ్మాస్మి

Friday, January 25, 2019

ఎవరో ఏదో అనుకుని
ఎవరో ఏదో అని
అది నువ్వు ఎవరి ద్వారానో విని
ఆపై నీకు ఏదో అనిపించి
నువ్వు ఇంకేదో అర్ధం చేసుకొని
పిచ్చి వాడివి రా నువ్వు ఈ జగమున
నీ పిచ్చి ఇంకొకడి పిచ్చి కారణమురా  !!

Wednesday, January 9, 2019


తెలుగు తీపి తెలిపే బూరె భళా  !!
బొబ్బట్లు లేని తెలుగు భొజనమెలా !!
అరెస లాంటి  వంటకం ఇంకొకటి కల్ల !!
జంతికల వలలో పడాల్సిందే మరలా మరలా !!

కనుల విందు కాదు ..కడుపు విందు ఇది .. తెలుగు  విందు  ఇది .. అద్భుతః ..

Sunday, September 2, 2018

నేనంటూ పోతే..ఏడవరా బిడ్డ..
నేనంటూ పోతే..నవ్వరా బిడ్డ..
నేనంటూ పోతే..మరువరా బిడ్డ..
నేనంటూ పోతే..తేడానే లేదు..
నేనంటూ పోతే..నువ్వింకా ఉన్నావ్..

Friday, August 31, 2018

చూడు మిత్రమా చూడు.. ఆస్వాదించు.. ఆనందించు..
అలలు చేసే శబ్ధం ఎన్నటికీ కాలుష్యం కాదు..
అలా వీచే గాలి ఎన్నటికీ ఆగేది కాదు ..
నీళ్ళు తాకే కాళ్ళు..ఆహా ఏమి ఆ ప్రాణం..
కళ్ళు చూసే గానం..ప్రకృతి ఆనంద గానం..

Sunday, January 28, 2018

నేనున్నా బ్రతికున్నా కొండ మీద ఇంటిలో
చెట్టన్నా పుట్టన్నా కనబడవే నాకెందుకో

Saturday, September 30, 2017

కుల గర్జన కాదు కుల గజ్జి ఇది
కలి కాలము కాదు కుల కాలము ఇది