"గురు.. శుక్ర .. శని .. శనివారం 29 వ రోజు అవుతుందండి .. ఆ రోజు చూసేయచ్చు .. " అని అన్నాది అమ్మమ్మ తాతయ్యగారితో. నా ఆనందానికి హద్దులు లేవు అసలు. అవును మా నాన్నని మొదటి సారి చూడడం మరి. అప్పటికే 27 రోజులు అయ్యింది నేను పుట్టి .. నక్షత్రాలు బాలేవు .. గ్రహాలు బాలేవు అని మా నాన్నని నన్ను చూడనివ్వలేదు . చిన్న పిల్లని కదా, అందుకే గట్టిగా అడగలేకపోయాను . బయలుదేరే ముందు రోజు అసలు నిద్దరే పట్టలేదు సుమా . ఆ ఉత్సాహం లో డాన్స్ కూడా చేశాను . మా అమ్మకి కూడా తెలిసి ఉండదు లెండి ఆ విషయం. పొద్దున్నే లేచాకా స్నానం చేయించి కొత్త బట్టలు వేసారు నాకు. అందరూ తయారయ్యి నాకు పాలు పట్టేసాక బయలుదేరాము కార్ లో . తాతయ్యగారు నన్ను చూసి అన్నారు 'నాన్నని చూచేచున్నావా' అని నవ్వుతూ . నేను మనసులో నవ్వుకుని బయటకి నిద్రపోతున్నట్టు నటించాను . దారి అంతా ఒకటే ఆలోచన . నాన్న నాలాగే ఉంటారా అని . గంటన్నర తర్వాత 'వచ్చేసాం' అన్నారు తాతయ్యగారు . కళ్ళు తెరిచిచూస్తే గుడి . అంతా సిద్దమే . పూజ ఒకటే ఆలస్యం . అమ్మ, నాన్న ఇద్దరూ పూజ మొదలు పెట్టారు . ఇంతలో నానమ్మ నన్ను ఆడించింది. ఇంతలో పంతులుగారు 'పాపని తెర వెనుక నుంచి నూని వైపు ఎత్తుకోండమ్మా ' అని అన్నారు . నానమ్మ అలాగే నన్ను గట్టిగా పట్టుకుంది . పంతులు గారు నాన్నని నన్ను నూని నీడలో చూడమన్నారు . అప్పుడు నేను నాన్నని ఆ నూని నీడలో చూసేసా !!! ఎన్నాళ్ళకీ .. అనుకున్నా . అప్పుడు నన్ను నాన్న ఒడిలో వేసారు . నాన్న నా వైపు చాలా సంతోషంతో చూసి ఎంతో మురిసిపోయారు ..
నాన్నకి ముద్దులతో ..
నాన్నకి ముద్దులతో ..